అందంలో పరమానందాలు చిలికె
వయ్యారం లో వెయ్యి వనములు విరిసె

మనస్సనే మందిరంలో సోయగాల సల్లాపాలు నిలిపి
జీవన సంజీవనాన్ని తెర తీసి మంజులాలు పంచి
కొప్పు లో కవ్వింతలల్లి మల్లెల స్వరాలు జత చేర్చి

అభయ హస్తాల లావణ్య దారాలతో నీ కౌగిట బంధించి
పరిమళ పందిట్లో నాలోని ద్వేష మృగాని చల్లార్చి
పసిడి పెదాలతో తరిగి తరగని మాధుర్యాలలో నన్ను ముంచి

అలల సంకీర్తనలె మన ఇరువురి భావ వేదన జల్లులు
వేసవి చల్లగాలులే మన అలసిన హృదయాల తీపి స్మృతులు
సాగర తీరాలే ఇక మన ప్రేమకు సంగమ శ్రుతులు

సూర్యోదయ వెలుగులే మన నిత్య సన్నిహిత్య విరజాజి వన్నెలు
కాటుక నీడలే నా జీవిత చీకటి క్షణాల ఆశ్రయ దివ్వెలు
ముడివేసిన మనోహర మాధుర్యాలు మన మధుర క్షణాలు

నా దారులన్నీ ఇక నీ దరికే చేరువవ్వనీ
నీ కొలువులో నే రాజునై రాణించని
నీ ముంగిటే నా మనసు మేలు కొలుపవ్వని